నేటి దిశ, సంగారెడ్డి: జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో గల నీటి వనరులు ఆక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటిపారుదల, హెచ్ఎండీఏ, మైన్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పీసీబీ, రెవెన్యూ, పంచాయతీ, హెచ్ఎండీఏ ఏరియా మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో నీటి వనరుల రక్షణ పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలో గల చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలన్నారు. ఆయా నీటి వనరుల సర్వే పూర్తి చేసి, బఫర్ జోన్, ఎఫ్ఎఎల్ తదితరాలతో చెరువు పరిధిని ఫిక్స్ చేసి నోటిఫై చేయాలన్నారు. రెవెన్యూ శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఎలాంటి తప్పులు జరగరాదని, రెవెన్యూ సర్వే అధికారులు చెరువుల బౌండరీలు సరిగ్గా ఫిక్స్ చేయాలని సూచించారు. తప్పుడు సర్వే జరిగినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, శిఖం భూములు, కుంటలను కబ్జా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, హెచ్ఎండిఏ ఈఈ, డీఈలు, నీటిపారుదల శాఖ ఎస్ఈ, ఈఈ, ఏడీ మైన్స్,డీపీఓ, సంగారెడ్డి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు,తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు,పీసీబీ ఈఈలు, తదితరులు పాల్గొన్నారు.